వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు
22న నిర్వహించనున్న టీటీడీ
తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కోట్లాది మంది భావించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలు, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి.
వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
మే 22వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణ యోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పుర వీధుల గుండా వేంచేపు చేస్తారు.
6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠి గానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు.