న్యూఢిల్లీ : భారత దేశంలో తాను స్థాపించిన స్టార్ లింక్ సేవలు కొనసాగించకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు స్టార్ లింక్ అధిపతి, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్. ఆయన తాజాగా తన సామాజిక వేదిక ఎక్స్ వేదికగా ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇది భారత దేశ ప్రభుత్వ పనితీరు పట్ల కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ స్పందించారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
స్టార్లింక్పై ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మా వరకు చూస్తే తాత్కాలిక స్పెక్ట్రమ్ అందించడంలో రవాణా శాఖ (DoT) దృక్కోణం నుండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ హోం మంత్రిత్వ శాఖ (MHA) జాతీయ ప్రయోజనాలను అన్ని కోణాల నుండి పరిశీలించి లైసెన్స్ మంజూరు చేస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక శాటిలైట్ కంపెనీకి సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇది అన్ని శాటిలైట్ కంపెనీలకు, వాటి వల్ల కలిగే నష్టాలు , ప్రయోజనాలకు సంబంధించినది అని స్పష్టం చేశారు.
ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే ఆయనకు సరిగ్గా ఏమి కావాలో దానిపై ఆయనే స్పష్టతతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో లేనందున, ప్రపంచ వ్యాప్తంగా ఏమి జరుగుతుందో అనే సమగ్ర సమాచారం ఆయనకు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఏ దేశాన్ని చూసినా, అన్ని దేశాలు సార్వభౌమమైనవే. అవి తమ నిర్ణయాలు తాము తీసుకోగలవు. అదే విధంగా, భారతదేశంలో మనం అన్ని కోణాల నుండి ఆలోచిస్తామని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్.






