దాడులు దారుణం బాబు ఆగ్రహం
వైసీపీకి షాక్ తప్పదన్న టీడీపీ చీఫ్
అమరావతి – రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆవేదన చెందారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. తాము ఓడి పోతున్నామన్న ఫ్రస్టేషన్ లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలను టార్గెట్ గా చేసి దారుణంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచి పద్దతి కాదన్నారు. దాడులు చేసుకోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుందే తప్పా ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొన్నారు.
చంద్రగిరి నియోకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గూండాలు బహిరంగంగా దాడులకు దిగడం శోచనీయమని అన్నారు. ఓటమి తప్పదని కోపంతో ఇలాంటి దాడులకు దిగారని మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు.
స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైర విహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది అని ప్రశ్నించారు. నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.
పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని అన్నారు . చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రిలలో ఈ దాడులు కొనసాగాయని తెలిపారు.