ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీ
కాంగ్రెస్..బీజేపీపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను ఏకి పారేశారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్ నిప్పులు చెరిగారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హస్తం, కమలం లోపాయికారి ఒప్పందం బయట పడిందని అన్నారు.
ఎవరిని మోసం చేసేందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పొద్దస్తమానం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా బలమైన నాయకులను నిలబెట్టలేదంటూ నిలదీశారు.
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉంటే ఆరేడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పనిగట్టుకుని బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించిందని, లోపాయికారిగా వారికి మేలు చేకూర్చేలా ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు కేటీఆర్.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్ట పడ్డాడంటూ సెటైర్ వేశారు.