బీఆర్ఎస్..కాంగ్రెస్ కు షాక్ తప్పదు
ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పట్టణంలో చుట్టి వచ్చారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే బండి సంజయ్ కుమార్ జనంతో కలవడం మొదలు పెట్టారు. మిగతా నేతలు వేసవి విడిది కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కానీ బండి మాత్రం తాను ప్రజా నాయకుడినేనని నిరూపించారు.
ఇది పక్కన పెడితే బుధవారం బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మోద్ సర్కార్ ఔర్ ఏక్ బార్ అన్నది తప్పకుండా వస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మొత్తం దేశంలో 545 లోక్ సభ స్థానాలకు గాను ప్రస్తుతం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు.
ఇందులో తమ పార్టీ కూటమికి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని, ఇది పక్కా అని పేర్కొన్నారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం పట్ల 143 కోట్ల మంది భారతీయులు నమ్మకాన్ని కలిగి ఉన్నారని చెప్పారు బండి సంజయ్ కుమార్.