కోతలు ఎక్కువ పని తక్కువ
రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కరెంట్ కోతల విషయంపై దాటవేత ధోరణి అవలంభించడం మంచి పద్దతి కాదన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఏం కావాలో తెలుసు కోకుండా మాట్లాడటం అపరిపక్వతను సూచిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం కరెంట్ పోకుండా చూశామని , ఇప్పుడు కరెంట్ పోవడం అనేది వరుసగా కొనసాగుతోందన్నారు.
తిరిగి పాత కాలం కష్టాలను గుర్తుకు తెస్తోందని వాపోయారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాటలు మార్చడం దారుణమన్నారు. మొన్నటికి మొన్న 9వ తేదీ లోపు రైతు భరోసా వేస్తామని చెప్పారు.
దేవుళ్ల మీద ఒట్లు వేయడం పరిపాటిగా మారిందన్నారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుడినంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు హరీశ్ రావు. విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.