బస్సులపై దాడులు సహించం
హెచ్చరించిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. గత కొంత కాలంగా ఆర్టీసీ బస్సులపై కొందరు కావాలని దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా గురువారం తీవ్రంగా స్పందించారు. ఇవాళ హైదరాబాద్ శివారు లోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన బస్సుపై కొందరు దుండగులు బైక్ లపై వచ్చి దాడులకు పాల్పడిన ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయని, అదృష్టవశాత్తు ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు ఎండీ.
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను సురక్షితంగా తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై ఇలా దాడులకు దిగడం దారుణమన్నారు. ఈ దాడులను ఇక నుంచి సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారని,. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.