NEWSANDHRA PRADESH

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి

చిత్తూరు జిల్లా – బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. నగ‌రి నియోజ‌క‌వ‌ర్గం వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామంలో చెరువులో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు.

ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ బాబు , విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు స్థానిక శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కే రోజా చిన్నారుల మృతదేహాలకు పుష్పమాలతో నివాళులర్పించారు. బాధిత తల్లిదండ్రులు డాక్టర్ బాబు, విజయ దంపతులను పరామర్శించారు. డాక్టర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ద్వారా భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు లోకాన్ని వీడ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.