నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా
రాయ్ బరేలి ప్రజలతో సోనియా
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్ బరేలి లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సోనియా గాంధీ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో రాయ్ బరేలి ప్రజలను , ఈ ప్రాంతాన్ని మరిచి పోలేనని అన్నారు. తన భర్త ను కోల్పోయిన నాటి నుంచి నేటి వరకు మీరంతా తనకు అండగా ఉన్నారని కొనియాడారు. మీకు ఏమిచ్చి రుణం తీర్చు కోగలనంటూ వాపోయారు సోనియా గాంధీ.
తీవ్రమైన అనారోగ్యం కారణంగా తాను ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడం లేదన్నారు. అందుకే తన వారసుడు , సౌమ్యుడు, విజ్ఞుడైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీని మీకు అప్పగిస్తున్నానని ప్రకటించారు.
ఇక నుంచి నా బిడ్డను చూసుకోవాల్సింది మీరేనంటూ పిలుపునిచ్చారు. నన్ను ఆశీర్వదించినట్లుగానే తన బిడ్డను కూడా దీవించాలని కోరారు సోనియా గాంధీ.