మేమొస్తే బుల్డోజర్లు ఉపయోగించం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
మహారాష్ట్ర – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మరాఠాలో పర్యటించారు. ఈ సందర్బంగా ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పవర్ లోకి వస్తే రామాలయంపై బుల్డోజర్ ప్రయోగిస్తారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు ఖర్గే.
రోజు రోజుకు ప్రధానమంత్రి దారి తప్పి మాట్లాడుతున్నారని, సోయి లేకుండా కామెంట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటి వరకు ఇన్నేళ్ల పాలనా కాలంలో ఎక్కడా , ఎప్పుడు బుల్ డోజర్లను ఉపయోగించ లేదన్నారు.
రెచ్చగొట్టే వారిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రధాని తన నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.