DEVOTIONAL

తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

Share it with your family & friends

రికార్డు స్థాయిలో ద‌ర్శ‌నం

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భ‌క్తులు భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం వేలాది మంది భ‌క్తుల‌తో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా గోవిందా గోవిందా , అనాధ ర‌క్ష‌క గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము, ప‌ది వేల శేషుల ప‌డ‌గ‌ల మ‌యం అంటూ భ‌క్తులు స్మ‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అస‌లే వేస‌వి కాలం కావ‌డం, ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌స్తున్నారు తిరుమ‌ల కొండ‌ను చూసేందుకు, ద‌ర్శ‌నం చేసుకునేందుకు. నిన్న స్వామి వారి వారం శ‌నివారం కావ‌డంతో ఏకంగా 90 వేల 721 మంది భ‌క్తులు ద‌ర్శించు కోవ‌డం విశేషం.

స్వామి కోసం భ‌క్తులు స‌మ‌ర్పించే త‌ల‌నీలాల‌ను 50 వేల 599 మంది స‌మ‌ర్పించారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.28 కోట్లు వ‌చ్చిన‌ట్టు టీటీడీ వెల్ల‌డించింది. ఆక్టోప‌స్ బిల్డింగ్ దాకా లైన్ ఉండ‌గా స‌ర్వ ద‌ర్శనం కోసం క‌నీసం 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపింది.