ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం
ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం
ఇరాన్ – ఇరాన్ దేశ అధ్యక్షుడు 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహరాన్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్సా నగరం సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ ప్రమాద విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. కాగా ప్రస్తుతం అధ్యక్షుడు రైసీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇంకా తెలియ రాలేదు.
ఈ ఘటనలో ఇబ్రహీం రైసీ లేదా ఇతర ప్రయాణీకులు ఎవరైనా గాయపడ్డారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. పొరుగున ఉన్న అజర్ బైజాన్ నుండి హెలికాప్టర్ లో ఇరాన్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
సంఘటన జరిగిన వెంటనే ఇరాన్ సర్కార్ అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని , కానీ వాతావరణ పరిస్థితులు సరిగా లేక పోవడం ఒకింత ఇబ్బందికరంగా మారిందని ఇరాన్ అంతర్గత మంత్రి వెల్లడించారు.
|ఈ హెలికాప్టర్ లో ఇబ్రహీం రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దుల్లాహియాన్ , తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి , పలువురు సీనియర్ అధికారులు కూడా హెలికాప్టర్ లో ఉన్నట్టు సమాచారం.