NEWSTELANGANA

ఆరోగ్య శాఖ‌పై స‌ర్కార్ శీత‌క‌న్ను

Share it with your family & friends

త‌గ‌ద‌న్న మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆరోగ్య శాఖ‌ను కావాల‌ని ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమ‌ని పేర్కొన్నారు హ‌రీశ్ రావు.

కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు.

లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టు మిట్టాడుతున్నాయ‌ని ఆరోపించారు. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెల‌కొంద‌న్నారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి వేత‌నాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.