రాజీవ్ స్పూర్తి దేశానికి దిక్సూచి
నివాళులు అర్పించిన షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి దివంగత దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్దంతి సందర్బంగా మంగళవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆధునిక భారత దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అందించిన సేవలు, దూర దృష్టి ఇవాళ దేశం సాంకేతికంగా పురోగమించడానికి దోహద పడేలా చేసిందని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఆనాడు తీవ్రవాదుల దాష్టీకానికి రాజీవ్ గాంధీ బలై పోయారని, గాంధీ కుటుంబం మొత్తం త్యాగాల పునాదుల మీద నడుస్తోందని స్పష్టం చేశారు. ఇవాళ ఎలాంటి త్యాగాలు చేయని వాళ్లు ఊరేగుతున్నారని, మతం పేరుతో , జాతీయ వాదం పేరుతో పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు.
దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా రాజీవ్ గాంధీ ఎల్లప్పటికీ ఈ దేశం గుండెల్లో నిక్షిప్తమై ఉంటారని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. మాజీ దేశ ప్రధాన మంత్రిగా మీరు నింపిన స్పూర్తి , మీరు చూపిన బాట ఎల్లప్పటికీ కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన జీవితం ఎందరికో స్పూర్తి కలిగిస్తుందని తెలిపారు.