తిరుమలలో సత్రం..కళ్యాణ మండపం
నిర్మిస్తామన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన తిరుమలలోని శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఆయనకు రచన అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. సాదర స్వాగతం పలికారు ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
శ్రీ శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్న అనంతరం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించి తిరుమలలో సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని చెప్పారు.
ఏపీతో సత్సంబంధాలు కొనసాగించడం, సమస్యలను పరిష్కరించు కోవడం, పరస్పర సహకారం అందించు కోవడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.