16న పార్వేట ఉత్సవం – టీటీడీ
అదే రోజు గోదా కళ్యాణం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్చాట్ శేష వస్త్రాన్ని సమర్పించారు. శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీ తిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారికి మేనమామ.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణ య ఉత్సవం చేపడతారు. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మ వారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ కృష్ణ స్వామి వారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.