DEVOTIONAL

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 65,416

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. అష్ట‌క‌ష్టాల‌కు ఓర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. వేస‌వి కాలం కావ‌డం, సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు తిరుమ‌ల‌కు.

దీంతో ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. జ‌ల ప్ర‌సాదంతో పాటు అన్న ప్ర‌సాదం కూడా అంద‌జేస్తోంది టీటీడీ.

ఇదిలా ఉండ‌గా శ్రీ స్వామి వారిని మే 23న గురువారం 65 వేల 416 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. స్వామి వారికి 36 వేల 128 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని తెలిపారు.

ఇక నిత్యం భ‌క్తులు స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ప్ర‌స్తుతం శిలా తోర‌ణం వ‌ర‌కు వేచి ఉన్నార‌ని, స‌ర్వ ద‌ర్శ‌నం కోసం క‌నీసం 20 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.