రేవ్ పార్టీతో సంబంధం లేదు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేఖ
హైదరాబాద్ – బెంగళూరులోని ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రధానంగా తెలుగు సినిమా రంగానికి సంబంధించి ముగ్గురు నటులు ఇందులో పాల్గొన్నారని, డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ప్రకటించారు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్. ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. టాలీవుడ్ ను మరోసారి కుదిపేసింది. ఇప్పటికే పలువురు నటీ నటులతో పాటు సాంకేతిక నిపుణులు, దర్శకులు సైతం ఇందులో పీకల లోతు కూరుకు పోయారన్న విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా టాలీవుడ్ కు చెందిన నటి హేమ, ఆషి రాయ్ తో పాటు నటుడు శ్రీకాంత్ మేఖ కూడా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా విస్తు పోయారు సినీ రంగానికి చెందిన వారు. మొత్తం రేవ్ పార్టీలో 103 మంది పాల్గొన్నారని, అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 86 మందికి పాజిటివ్ గా తేలిందని పోలీసులు నిర్దారించారు.
వీరిలో టాలీవుడ్ కు చెందిన హేమ, శ్రీకాంత్ , ఆషి రాయ్ లకు సీసీబీ నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మొత్తంగా ఈ ముగ్గురు నటులు మాత్రం తాము లేనే లేమంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. చివరకు అడ్డంగా దొరికి పోయారు.