కన్హయ్య కుమార్ కు రాహుల్ కితాబు
యువతకు ఆదర్శ ప్రాయమన్న నేత
న్యూఢిల్లీ – నేటి యువత రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో ఈశాన్య ఢిల్లీ ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న కన్హయ్య కుమార్ కు మద్దతు ప్రకటించారు. నేటి యువతకు ఆదర్శ ప్రాయమైన నాయకుడిగా ఎదిగాడని కొనియాడారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కన్హయ్య కుమార్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడని , ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో యువత తరపున గొంతు వినిపించాడని అన్నారు. ఇలాంటి యువతీ యువకులే దేశానికి కావాల్సిన అవసరం ఉందన్నారు.
తమ పార్టీ కన్హయ్య కుమార్ ను అక్కున చేర్చుకుందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ వచ్చిన కన్హయ్య కుమార్ ను పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తులే రేపటి దేశ భవిష్యత్తుకు అండగా నిలుస్తారనడంలో సందేహం లేదన్నారు రాహుల్ గాంధీ.