మోడీకి పేదలంటే చులకన
డబ్బున్న వాళ్లకు ఆయన పీఎం
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో ఆరి తేరారంటూ ఎద్దేవా చేశారు. ఆయన గత 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తూనే ఉన్నారని, ఇప్పటి వరకు దేశం కోసం ఏం చేశారో చెప్పమంటే నీళ్లు నములుతున్నారని ఆరోపించారు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కాదని కేవలం అదానీ, అంబానీకి మాత్రమే పీఎం అంటూ సెటైర్ వేశారు రాహుల్ గాంధీ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత మోడీకే దక్కుతుందని ఆరోపించారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ప్రధానంగా మోడీకి ధనవంతులు, బిలియనీర్లు, పెట్టుబడిదారులంటే ఇష్టమని, ఆయన వారి కోసమే పని చేస్తారని ధ్వజమెత్తారు. ఆయనకు పేదలంటే చులకన అని మండిపడ్డారు.