సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం
అమరావతి : దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన తన జీవిత కాలంలో 15 ఏళ్ల పాటు సీఎంగా పని చేయడం విశేషం. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన దూరదృష్టి, మార్గదర్శకత్వం ఎందరికో స్పూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లుగా రాజకీయాలలో కొనసాగుతుండడం మామూలు విషయం కాదన్నారు. ఆయన నిరంతర పనిమంతుడని కితాబు ఇచ్చారు.
చంద్రబాబు నాయకత్వం వహించే ప్రతి కాలం, ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకు వస్తుందని చెప్పారు అచ్చెన్నాయుడు. ఆయనలో ఉన్న సూక్ష్మ దృష్టి, పట్టుదల, పరిపాలన నైపుణ్యం, ప్రజాసేవా తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయని కితాబు ఇచ్చారు. దేశ స్థాయిలోనూ ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం అని ప్రశంసించారు. అభివృద్ధి, నూతన ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న ఆయనకు ఈ రోజు మరొక మైలురాయి అని అన్నారు. ఆయన వంటి విజనరీ నాయకుడు మన రాష్ట్రానికి వరం అన్నారు. ఆయన పాలనలోనే ఆంధ్రప్రదేశ్ నిజమైన అర్ధంలో సుజన పాలన, స్మార్ట్ రాష్ట్రం దిశగా పయనిస్తుంది అని పేర్కొన్నారు.






