హైదరాబాద్ ను వీడుతున్న కంపెనీలు
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఎంతో కష్టపడి దిగ్గజ కంపెనీలను ఇక్కడికి తీసుకు వచ్చేలా చేశానని అన్నారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎంతో శ్రమకోర్చి తీసుకు వచ్చిన కంపెనీలు, ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఒక్కరొక్కరుగా వీడుతుండడం తనను బాధకు గురి చేసిందన్నారు. ఎంతో కష్టపడితేనే కానీ ఇవి రావన్నారు. ఐటీ, పరిశ్రమల పరంగా టాప్ లో ఉన్న హైదరాబాద్ ప్లేస్ రాను రాను తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోందని ఆవదేన చెందారు.
దీనికంతటికి ప్రధాన కారణం కేవలం ప్రభుత్వం మారడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ దుస్థితి నెలకొందన్నారు. ఖజానాలో డబ్బులు లేవంటూ చెప్పడం, దివాళా అంచున ఉందని అనడం వల్ల మరిన్ని కంపెనీలు ఇంటి బాట పడుతున్నాయని ఆరోపించారు.