స్వాములను విడుదల చేయండి
హనుమాన్ దీక్షా స్వాములపై దాడి
కరీంనగర్ జిల్లా = భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు తాజాగా హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములపై తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన స్వాములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఖాకీల పని కేవలం లా అండ్ ఆర్డర్ ను నిర్వహించడం మాత్రమేనని , సమస్యలను పనిగట్టుకుని సృష్టించడం కాదన్నారు . తాము అన్ని విధాలుగా పోలీసులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కరీంనగర్ పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు బండి సంజయ్ . వెంటనే స్వాములను విడుదల చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.