ఐపీఎల్ 2024 విజేత కోల్ కతా
8 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – 2024 లో భాగంగా చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
17వ లీగ్ ఆరంభం నుంచి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది కేకేఆర్. ఎక్కడా తగ్గ లేదు. ఇంకెక్కడా తడబాటుకు గురి కాలేదు. ఎలాగైనా సరే గెలిచి తీరాలని అనుకున్న ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ ఊహించని రీతిలో ఖంగుతింది. ఎక్కడా పోరాట పటిమను ప్రదర్శించ లేదు.
ఆట ఆరంభం నుంచి చివరి దాకా కోల్ కతా తన ప్రతాపాన్ని చూపించింది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తనే ఈ ఐపీఎల్ కప్ కు సిసలైన జట్టునంటూ తేల్చి చెప్పింది. కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య కీలక పోరును ఉత్కంఠతతో ఎదురు చూశారు. కానీ ఆట మొత్తం ఏక పక్షంగా సాగింది.
ప్రధానంగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ను కోల్ కతా బౌలర్లు తుక్కు రేగ్గొట్టారు. మిస్సైల్ లాంటి బంతులతో బెంబేలెత్తించారు. తమకు ఎదురే లేదని చాటారు. హైదరాబాద్ జట్టును కేవలం 113 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఇంకా 8.5 ఓవర్లు మిగిలి ఉండగానే పని పూర్తి కానిచ్చేశారు.
కోల్ కతా తరపున గుర్బాజ్ 39 రన్స్ చేస్తే వెంకటేశ్ అయ్యర్ రెచ్చి పోయాడు . హాఫ్ సెంచరీతో జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు. దీంతో ఐపీఎల్ కప్ కోల్ కతా వశమైంది.