రహమనుల్లా గుర్బాజ్ సూపర్
ఐపీఎల్ ఫైనల్ 2024లో బిగ్ షో
చెన్నై – చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ లో హైదరాబాద్ ను చిత్తు చేసింది. కోల్ కతా కొట్టిన దెబ్బకు సన్ రైజర్స్ విల విల లాడింది. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక రకంగా ధీటుగా జవాబు ఇస్తుందని, మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని అంతా అనుకున్నారు. వారి ఆశలను, కలలను పటాపంచలు చేస్తూ కేకేఆర్ బిగ్ షాక్ ఇచ్చింది.
జట్టు బౌలర్లు మిచెల్ స్టార్క్ , ఆండ్రీ రస్సెల్ కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశారు. హైదరాబాద్ బ్యాటర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. కేవలం 18.1 ఓవర్ల లోనే సన్ రైజర్స్ చాప చుట్టేసింది. 113 పరుగులకే పరిమితమైంది హైదరాబాద్.
జట్టులో ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కడే 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ ను దాట లేక పోయారు. టోర్నీ మొత్తంలో దంచి కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వరద పారిస్తూ వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , క్లాసెన్ , నితీశ్ కుమార్ రెడ్డి లు పెవిలియన్ బాట పట్టారు. ప్రధానంగా కోల్ కతా బౌలర్ల ధాటికి విల విల లాడారు.
హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 11.5 ఓవర్లలోనే పూర్తి చేశారు కోల్ కతా బ్యాటర్లు. కేవలం 2 వికెట్లు కోల్పోయి పని కానిచ్చేశారు. ఆఫ్గనిస్తాన్ బ్యాటర్ రహమనుల్లా గుర్బాజ్ దాడి చేశాడు. 39 రన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడికి తోడు వెంకటేశ్ అయ్యర్ రెచ్చి పోయాడు. హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ ఇద్దరూ కలిసి కోల్ కతాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందజేశారు.