కేటీఆర్ కామెంట్స్ దుద్దిళ్ల సీరియస్
కంపెనీలు వెళ్లి పోవడం లేదు
హైదరాబాద్ – ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీరియస్ కామెంట్స్ చేశారు. తన శాఖపై లేనిపోని ఆరోపణలు చేసిన మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం దుద్దిళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనంటూ కొట్టి పారేశారు.
ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి. వెళ్లిపోతున్న కంపెనీలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దావోస్ వేదికగా కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు రూ. 40000 వేల కోట్ల పెట్టుబడి కాకుండా రూ. 9000 కోట్ల విలువైన ఒప్పందాలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
ఇక కీన్స్ టెక్నాలజీ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాల కోసం వేచి ఉందన్నారు . గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పాలన కంటే మరింత మెరుగైన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు .
తాము ప్రస్తుతం ఖాళీగా లేమని కొన్ని కంపెనీలు పోతే మరికొన్ని కంపెనీలు వస్తాయని అన్నారు. వాస్తవాలు తెలుసు కోకుండా కామెంట్స్ చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.