సీఎం రెండు నాల్కల ధోరణి
తగదన్న మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని , పాలనను గాడి తప్పేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక చిహ్నాన్ని మార్చాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. కాకతీయ కళా తోరణం పట్ల ఎందుకంత కోపం, చార్మినార్ పట్ల ఎందుకంత చిరాకు అని ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కావని వెయ్యేళ్ల సాంస్కృతిక చిహ్నానికి ప్రతీక అని గుర్తు చేశారు .
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ ఉద్యమ గీతంలో కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పారని అది కూడా తెలుసు కోకుండా మార్చాలని అనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి అని ప్రశ్నించారు.
అధికారిక గీతంలో కీర్తిస్తూనే అధికారిక చిహ్నంలో అవమానిస్తామంటే ఎలా అని మండిపడ్డారు కేటీఆర్.
చార్మినార్ కట్టడం కాదు హైదరాబాద్ కు ఓ ఐకాన్ అని స్పష్టం చేశారు. కాకతీయుల కళా తోరణం అంటే నిర్మాణం కాదని అది సిరి సంపదలతో వెలుగొందిన నేలకు నిలువెత్తు సంతకమన్నారు.