దైవ భూమిలో హస్తం హవా
ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ
హిమాచల్ ప్రదేశ్ – దైవ భూమిగా కోట్లాది మంది భావించే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడం ఖాయమని జోష్యం చెప్పారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
కొంతకాలం క్రితం హిమాచల్ ప్రజలు భయంకరమైన విపత్తును ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. చుట్టూ విధ్వంసం నెలకొందన్నారు ప్రియాంక గాంధీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి విపత్తును అధిగమించేందుకు ప్రయత్నించగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర నిధులను నిలిపి వేసి సహాయాన్ని నిలిపి వేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. విపత్తులో సహాయం చేయడానికి బదులుగా, మోడీ , అమిత్ షా తమ ఆర్థిక శక్తిని ఉపయోగించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు ప్రియాంక గాంధీ.