బీసీలు రోడ్ల పైకి వస్తే పుట్టగతులు ఉండవు
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఆయన బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తప్పా అన్ని సమస్యలు పరిష్కారం చేశారని ఆరోపించారు. ఎంపీ లక్ష్మణ్ పీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. సీఎంతో కలిసి అన్ని పార్టీల ప్రతినిధులు వచ్చి కలుస్తారని అన్నారు. బీసీ సమాజం రోడ్ల్ మీద కు వస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు జాజుల శ్రీనివాస్ గౌడ్. వెంటనే అల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం లో జానారెడ్డి, కోదండరాం కేసీఆర్ లు తొలి మీటింగ్ ఇక్కడే పెట్టారని గుర్తు చేశారు. కోర్టులో కేసులు వేసిన వ్యక్తులు చాలా చిన్న వాళ్ళు అని అన్నారు. అన్ని కులాలకు చెందిన వారు బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలికారని చెప్పారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా మద్దతు పలకాలని అన్నారు. చట్ట సభల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ, బిఅరెస్ పార్టీలలో కూడా బీసీ నాయకులు మద్దతు తెలియ చేస్తున్నారని ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు ఎమ్మెల్సీ. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి ఆమోదించకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నోటి కాడి ముద్దను లాక్కున్నారని, అందరినీ కలుపుకుని తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇరావత్ అనిల్ మాట్లాడుతూ హైకోర్టు స్టే పై సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేస్తామని, అలాగే బిసి రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు .
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పార్టీల మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దని కోరారు. రిజర్వేషన్ల అంశం క్షేత్ర స్థాయికి వెళ్లిందన్నారు. చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని విఫలం అయ్యారని, కానీ తమిళనాడులో దివంగత సీఎం జయలలిత ఒక్కరే సక్సెస్ అయ్యారని, 9వ షెడ్యూల్ లో చేర్చి పట్టు పట్టి అమలు చేశారని చెప్పారు. పార్లమెంట్ లో రిజర్వేషన్లు ఆమోదం పొందాలి అంటే అన్ని పార్టీ ల ఎంపీ లు మద్దతు పలకాలని అన్నారు.
సిపిఎం నేత రవికుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు మొదటి ముద్దాయి బిజెపి అని, రాజ్ భవన్ లను రాజకీయ కేంద్రాలుగా చేసుకుని బిజెపి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీసీలంతా వేలాదిగా రాజభవన్ ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 30 బీసీ కుల సంఘాలు, 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, యూనివర్సిటీల ఆచార్యులతో పాటు బీసీ సంఘాల నేతలు విజిఆర్ నారగొని, దాసు సురేష్, ఇందిరా శోభన్, కుందారం గణేష్ చారి, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వరి, ప్రొఫెసర్ నరేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యాం కుర్మా, ఉప్పర శేఖర్ సగర, దిటి మల్లయ్య, మురళీకృష్ణ, బర్ల మణిమంజరి సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, జిల్లెల నరసింహ, దేశగోని సాంబశివ గౌడ్, కిరణ్ కుమార్, పిడికిలి రాజు, నరసింహ నాయక్, తారకేశ్వరి, సమత యాదవ్, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.






