10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు. గత కొన్ని నెలల నుంచి తను వరుసగా సమీక్షలు చేపడుతూ వచ్చారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి 10 వేలు జనాభా దాటిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా మారుస్తామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తామని అన్నారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయని తెలిపారు. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరిస్తామని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మారుస్తామన్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమైందని, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు పవన్ కళ్యాణ్.
స్వతంత్ర యూనిట్లుగా 13,351 గ్రామ పంచాయతీలు ఉంటాయన్నారు. గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించిందని తెలిపారు డిప్యూటీ సీఎం. రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బందిని నియమిస్తామన్నారు. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు.






