సీఈసీని కలిసిన పవన్..బాబు
రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితిపై ఆరా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని బృందం ఏపీలో కొలువు తీరింది. ఈ సందర్బంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సీఈసీని కలిశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధినేతలతో ఎన్నికల అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, ఓట్ల నమోదు, కొత్త ఓటర్లలో ఏమైనా తప్పులు దొర్లాయా, తీసుకోవాల్సిన చర్యల గురించి పార్టీల చీఫ్ లతో చర్చించనున్నారు. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలకు చెందిన అధినేతలు ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు సీట్ల సర్దుబాటుకు సంబంధించి పలుమార్లు చర్చలు జరిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. బీజేపీ సైతం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.