గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
ప్రజా పాలన అంటే ఇదేనా
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఎవరిని అడిగి రాష్ట్ర రాజ ముద్రలో మార్పులు చేస్తున్నారంటూ నిలదీశారు.
ఇందు కోసమేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చిందని మండిపడ్డారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు మార్పులు చేసుకుంటూ పోతే ఇక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందని ప్రశ్నించారు.
ఒక రకంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల పాలనకు ఎలాంటి తేడా లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ చార్మినార్ కు ప్రయారిటీ ఇచ్చిందని , ఇక రేవంత్ రెడ్డి దానిని తీసి వేస్తానని అంటున్నాడని ఇదంతా ఇప్పుడు అవసరమా అని అన్నారు.
భాగ్య నగరానికి ఐకాన్ చార్మినార్ కాదని భాగ్యలక్ష్మి టెంపుల్ అని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. లోగో మార్పులపై ఫోకస్ కాకుండా ప్రజా పాలన సాగించేందుకు ప్రయత్నిస్తే బెటర్ అని సూచించారు.