జైలుకు వెళ్లినా తల వంచను
ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జైలు జీవితం గడిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా తాను ప్రచారం చేయాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే జూన్ నెల 2వ తేదీ వరకు మాత్రమే ఆయనకు అవకాశం ఉంది.
ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. టెస్టులు చేసుకోవాల్సి ఉందని ఈ మేరకు తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరోగ్యంగా ఉండడం వల్లనే ప్రచారం చేశారని, ఇక వెసులుబాటు ఇవ్వడం కుదరదని కుండ బద్దలు కొట్టింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తీహార్ జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ తల వంచే ప్రసక్తి లేదన్నారు సీఎం.