ఏపీలో ఫలితాలపై ఉత్కంఠ
గెలుపు ధీమాలో జగన్ ..బాబు
అమరావతి – దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక ఏపీలో మాత్రం రాజకీయ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇక అధికారంలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం మరోసారి తానే సీఎం అవుతానంటూ ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు ఆయన జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇటీవలే విదేశీ పర్యటనకు వెళ్లారు. అంతే కాకుండా వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లారు. విస్తృతంగా పర్యటించారు. మొత్తంగా గెలుపు ధీమాను వ్యక్తం చేశారు.
ఇక ఈసారి ఎన్నికల్లో ట్విస్ట్ ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. గతంలో ఇదే బాబు యూపీఏకు మద్దతు ఇచ్చారు. తర్వాత ఏపీ ప్రయోజనాల దృష్ట్యా తాను మారానంటూ ప్రకటించాడు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.
ఈసారి ఎలాగైనా సరే జగన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు, పవన్ టీం. కొన్ని మీడియా సంస్థలు గంప గుత్తగా టీడీపీ కూటమికే ఛాన్స్ అంటూ ఊదర గొడుతున్నాయి. మరికొన్ని సర్వే సంస్థలు ఈసారి కూడా జగన్ దే హవా అంటూ ప్రచారం చేశాయి. ఇక కాంగ్రెస్ అనూహ్యంగా తెర పైకి వచ్చింది. వైఎస్ షర్మిల రాకతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. మొత్తంగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపు గుర్రాలు ఎవరో తేలుతుంది ఆరోజు.