తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక
జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి
హైదరాబాద్ – భారత దేశ చరిత్రలో సుదీర్ఘమైన పోరాటాలకు, ఆరాటాలకు, ఉద్యమాలకు, నిరసనలకు , ఆత్మ త్యాగాలకు, బలిదానాలకు పెట్టింది పేరు తెలంగాణ. నా తెలంగాణ మాగాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. తర తరాలుగా అణిచి వేతకు గురైన ప్రాంతం. లక్షలాది మంది నిత్యం ఇబ్బందులకు గురైన సన్నివేశం. చిన్నారుల నుంచి పండు ముదుసలి దాకా ఏకైక నినాదంగా మారు మ్రోగిన సన్నివేశం తెలంగాణ ఉద్యమం.
ఈ దేశంలో తెలంగాణ అనేది విస్మరించ లేని పదం. ఎవరూ కాదనలేని సత్యం. పోరాటాలకు ఊపిరి పోసింది గడ్డ. కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులకు పెట్టింది పేరు. ఒక రకంగా చెప్పాలంటే ఘనమైన కీర్తిని, సంస్కృతిని కలిగి ఉన్న ప్రాంతం తెలంగాణ.
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేసింది ఒకే ఒక్క పదం బతుకమ్మ. దానిని విశ్వ వ్యాప్తంగా చేయడమే కాదు పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేలా చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా బతుకమ్మనే. ఎంత చెప్పినా నా తెలంగాణ గురించి ఇంకా చెప్పాల్సి వస్తూనే ఉంటుంది. అంతటి ఘనకీర్తిని స్వంతం చేసుకున్నది ఈ నేల.
దీనిని విధ్వంసం చేసిన వాళ్లు ఇంకా బతికే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే వారి మనుషులే ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతుండడం మరింత విషాదం. ఏది ఏమైనా కేసీఆర్ మంచికో చెడుకో చేసిన ఉద్యమమే రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది. సంబండ వర్ణాలను ఏకం చేసింది. ఏకునాదం మోతై నిలిచింది. సరిగ్గా 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడింది. రేపటితో 10 ఏళ్లు పూర్తవుతుంది ఈ ప్రాంతానికి. జయహో తెలంగాణ.