హైదరాబాద్ బాద్ షా ఎవరో
మాధవీలత వర్సెస్ ఓవైసీ
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియకు తెర పడింది. శనివారం నాటితో ఏడవ విడత పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో పోటీ కొనసాగడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందిన కొంపెల్లి మాధవీలతను ఏరికోరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో హైదరాబాద్ లోక్ సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఆమె జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు.
ఏ మహిళా నాయకురాలికి లేనంతటి ప్రాధాన్యత ఆమెకు దక్కింది. ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమెను ప్రశంసించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మాధవీలతతో ఇంటర్వ్యూలు చేపట్టారు. ఇదంతా పక్కన పెడితే మొదటిసారిగా ఎంఐఎం చీఫ్, సిట్టింగ్ ఎంపీ ఓవైసీ తీవ్రమైన పోటీని ఎదుర్కొనడం విశేషం.
ఇక ఫలితాలు ఏ రకంగా ఉండ బోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మాధవీలత గెలుస్తుందా లేక ఓవైసీ మరోసారి సత్తా చాటుతారా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది.