ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్
అమరావతి – మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని, మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండేలా పొడిగించాలని కోరారు.
విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారని, ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, రక్షణ భద్రతలను కాపాడే బాధ్యతలను గవర్నర్ చేతిలో ఉండేవన్నారు,
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి చాలా మంది ప్రజలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారని, రేపటి నుండి ఈ ప్రజల, ఆస్తులు రక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు బాధ్యత తీసుకుంటుందని శైలజానాథ్ ప్రశ్నించారు.
సెక్షన్-95 ప్రకారం విద్యార్థులకు పదేండ్ల పాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలని, ఆర్టికల్ -317 డీ ప్రకారం అడ్మిషన్ల కోటా పదేండ్ల వరకు కొనసాగించాలని, ఎమ్సెట్ సహా 7 రకాల ప్రవేశ పరీక్షల కూడా ఉమ్మడిగా నిర్వహించేవారని ఆయన గుర్తుచేశారు.
ఇప్పటి వరకు ఆ పరీక్షల నోటిఫికేషన్లు జూన్ 2కు ముందే విడుదల కావటంతో ఉమ్మడి విద్యార్థి, విద్యార్థినిలకు అవకాశం కలిగిందని శైలజానాథ్ తెలిపారు. ఈ ఒక్క విద్యా సంవత్సరం మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారని, వచ్చే ఏడాది నుండి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందని ఆయన ఆరోపించారు.
10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారిందని, అపెక్స్ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని, దీనిపై కేంద్రం ఎటూ తేల్చక పోవటం పై శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.