పెట్టుబడిదారులకు పచ్చ జెండా
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఔత్సాహికులకు, కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తామన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రముఖ గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు మరికొందరు సీఎం, సీఎస్ శాంతి కుమారితో చర్చించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ , ఫర్నీచర్ , కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్బంగా సీఎం కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తుందన్నారు. కొత్తగా కంపెనీల ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో 39 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటైతే వాటి ద్వారా ఉపాధి కల్పనకు ఎక్కువగా ఆస్కారం ఏర్పడుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఎవరూ కూడా ఉద్యోగం లేదని బాధ పడకూడదన్నారు.