ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ
జూన్ 4న మంగళవారం నిరీక్షణ
హైదరాబాద్ – ఎన్నికల పండుగ ముగిసింది. పోలింగ్ పూర్తయింది. ఇక కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 4న మంగళవారం ఓట్లకు సంబంధించి కౌంటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 17వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడు విడతలుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది.
విచిత్రం ఏమిటంటే ఏకంగా పోలింగ్ లో భారతీయులు రికార్డు సృష్టించారు. 64 కోట్లకు పైగా ఓటర్లు తమ విలువైన ఓటు హక్కు వినియోగించు కోవడం విశేషం. జి7 దేశాలలో కంటే ఈసారి అత్యధికంగా మన ఓటర్లు స్పందించడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈసారి జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కింతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం లోగా ఎవరు గెలుస్తారనేది తేలనుంది. మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వస్తుందా లేక ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి నెగ్గుతుందా వేచి చూడాలి.