ఓట్ల లెక్కింపు సిబ్బందికి థ్యాంక్స్
ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా
అమరావతి – ఏపీలో ఎన్నికల పండుగ ముగిసింది. ఫలితాలు ఊహించని రీతిలో వెల్లడయ్యాయి. టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ సందర్బంగా ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో పాటు పోలింగ్ సిబ్బంది లెక్కింపును శాంతియుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి థ్యాంక్స్ తెలిపారు ఏపీ సీఈవో.
ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు తాను ఎంతో సంతోషానికి లోనవుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాల వారికి ఎంతో ఆదర్శంగా ఉందన్నారు.
మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా. జిల్లాల వారీగా అనుసరించిన వినూతన్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేధికలను తమ కార్యాలయానికి మూడు రోజుల్లో పంపాలని ఆయన కోరారు. వచ్చే నివేధికల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.