టీటీడీ చైర్మన్ రేసులో నాగ బాబు..?
అన్నకు తమ్ముడి ఆఫర్
అమరావతి – అదృష్టం ఎవరిని ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. పైన ఉన్నాడని అనుకున్న దేవుడు తప్ప. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీయాలు శర వేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఉండేది. కానీ తాజాగా జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని బండ కేసి కొట్టారు. కర్ర కాల్చి వాత పెట్టారు.
దీంతో కొత్తగా భారీ ఎత్తున ఆధిక్యంతో సీట్లను గణనీయంగా సాధించింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి. ఈ మేరకు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉన్నతాధికారుల పోస్టింగ్ ల విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇటు ఏపీలో అటు ఎన్డీయేలో కీలకమైన పాత్ర పోషించారు జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మేరకు కూటమి ఒప్పందంలో భాగంగా తనకు కేటాయించిన 21 సీట్లను కైవసం చేసుకున్నారు. దీంతో తన మాటకు మరింత విలువ పెరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో జోరుగా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటి దాకా చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నట్టుండి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఒకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు , ప్రముఖ నటుడు , జబర్దస్త్ ఫేమ్ కొణిదెల నాగేంద్ర బాబు (నాగ బాబు) ను టీటీడీ చైర్మన్ పదవి కట్ట బెడతారని టాక్. ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలని అనుకున్నారు. కానీ మిస్ అయ్యింది.