వాలంటీర్లకు ఖుష్ కబర్
ఏపీ నూతన సర్కార్ ఆఫర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి సర్కార్ కొలువు తీరనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు బాబు ఇటు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాట మార్చారు.
వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చిన జగన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా మొదట రద్దు చేస్తామన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా విధులు నిర్వహిస్తున్న వాలంటీలర్ల గురించి వాస్తవాలు తెలుసుకున్నాక వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచుతామని చెప్పారు.
వాలాంటీర్లు ఆశించినట్టుగానే చంద్రబాబు కూటమి బంపర్ మెజారిటీ సాధించింది. అటు శాసన సభలో ఇటు లోక్ సభలో దుమ్ము రేపింది. వైసీపీని ప్రతిపక్ష హోదా లేకుండా క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా కీలక ప్రకటన చేసింది కొత్త సర్కార్. వాలంటరీ వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
ఇక నుంచి ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని, ఇప్పుడు ఉన్న రూ. 5 వేల జీతాన్ని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా వాలంటీర్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
వాలంటీర్లుగా ఎంపికయ్యేందుకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని , 1994 నుండి 2003 వరకు వయో పరిమితి విధించినట్లు వెల్లడించింది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది.