ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్ చేయాలి
విచారణ చేపట్టాలని జనసేన డిమాండ్
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ సర్కార్ ఏరికోరి ధర్మా రెడ్డిని టీటీడీ అప్పగించింది. ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారని, కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించారంటూ విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, జనసేన , బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ ప్రధానంగా కొనసాగుతోంది.
జనసేన నేత కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీలో అంతులేని విధంగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ధర్మా రెడ్డి పారి పోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా ఉంచాలని కోరారు. పాస్ పోర్ట్ ను సీజ్ చేయాలని, గత ఐదేళ్లుగా ఎలాంటి అర్హత లేక పోయినా , ఐఏఎస్ కాక పోయినా జగన్ సపోర్ట్ తో చెలరేగి పోయాడని, ఈవోగా ఆధిపత్యం చెలాయించాడని ఆరోపించారు.
టీటీడీకి సంబంధించి లెక్కలు చూపకుండా విదేశాలకు పారి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు జనసేన నేత. ఈ మేరకు సీఐడీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.