వైఎస్సార్ విగ్రహాలపై దాడులు తగదు
ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని పిలుపునిచ్చారు.
ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదన్నారు వైఎస్ షర్మిల. తెలుగువాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని కొనియాడారు. ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని జ్ఞాపకమని పేర్కొన్నారు.
గొప్ప నాయకుడైన వైఎస్సార్ కు నీచ రాజకీయాలు ఆపాదించడం సరి కాదన్నారు. బాధ్యులైన వారిపై వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.