ఒకప్పుడు కానిస్టేబుల్ నేడు మంత్రి
చరిత్ర సృష్టించిన సీఆర్ పాటిల్
న్యూఢిల్లీ – మోడీ మంత్రివర్గంలో చేరిన సీఆర్ పాటిల్ ఒకప్పుడు కానిస్టేబుల్ గా పని చేశారు. ఆయన గుజరాత్ కు చెందిన వారు. 1975లో పోలీస్ కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించారు. 14 ఏళ్ల పాటు వివిధ హోదాలలో పనిచేశారు. 1991లో నవ గుజరాత్ టైమ్స్ లో జర్నలిస్ట్ గా కూడా పని చేశారు సీఆర్ పాటిల్.
ఆయన పూర్తి పేరు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్. కానిస్టేబుల్ నుంచి అత్యున్నతమైన కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఆయన కథ ఎందరికో స్పూర్తి కలిగిస్తుందని చెప్పక తప్పదు. సీఆర్ పాటిల్ తన తండ్రి అడుగు జాడల్లో నడిచాడు. పబ్లిక్ కమ్యూనికేషన్స్ పై పట్టు పెంచుకున్నారు.
1989లో బిజెపితో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. అనేక కీలక పదవులు చేపట్టారు. కోశాధికారిగా , బీజేపీ సూరత్ సిటీ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశాడు. దీంతో కీలకమైన గుజరాత్ అల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్నారు.
పాటిల్ తొలిసారిగా 2009లో నవ్సారి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు, అర్బన్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , సివిల్ ఏవియేషన్‌తో సహా అనేక కీలక కమిటీలలో చురుకుగా ఉన్నారు.
పాటిల్ తన సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు.