ఓడి పోయినా ప్రశ్నిస్తూనే ఉంటా
అనుగుల రాకేశ్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – తాజాగా జరిగిన ఖమ్మం – నల్లగొండ – వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని పేర్కొన్నారు.
చట్ట సభల్లో ప్రజల పక్షాన గొంతు వినిపించాలని కోరుకున్నానని, కానీ అనుకోకుండా తనను ఓడించారని ఇందుకు సంబంధించి తాను ఎవరినీ తప్పు పట్టడం లేదన్నారు రాకేశ్ రెడ్డి. పార్టీ పరంగా తనకు ఎంతగానో సహకరించారని ఈ సందర్బంగా పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చట్ట సభలు ఏడాదికి కేవలం రెండు నెలలే పని చేస్తాయని కానీ తాను జన సభల్లో 365 రోజులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానని, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు రాకేశ్ రెడ్డి.
రాజకీయాలకు అతీతంగా తాను పని చేస్తానని చెప్పారు. విద్యాధికుడిగా తన సేవలు నడుస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. అభివృద్ది అన్నది తన నినాదమని పేర్కొన్నారు.