ఏపీ ప్రజలకు రుణపడి ఉన్నా
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
అమరావతి – జగన్ రెడ్డి రాచరిక పాలనకు చరమ గీతం పాడిన రాష్ట్ర ప్రజలకు పేరు పేరునా తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు టీడీపీ చీఫ్ , ఏపీకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన, భారతీయ జనతా పార్టీ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నారా చంద్రబాబు నాయుడుని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వారందరి తరపున లేఖలు కూడా ఇచ్చారు.
దీంతో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమై పోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు సకల ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే కొత్త సీఎస్ గా ప్రసాద్ ను ఎంపిక చేశారు. జగన్ రెడ్డికి సహకరించిన అధికారులకు స్థాన చలనం కలిగింది.
ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. గత 5 ఏళ్ల కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు నరకం అంటే ఏమిటో చూపించారని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు యత్నించారని, చివరకు తన భార్యను కూడా లాగారాని వాపోయారు. తాను గెలిచేంత వరకు అసెంబ్లీకి రానని ప్రకటించానని, ప్రజలు తనను ఆశీర్వదించారని అన్నారు.