రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిన తెలంగాణ
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై. రోజు రోజుకు అప్పుల కుప్పగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెలతో కలుపుకుంటే రాష్ట్ర అప్పు ఏకంగా రూ. 2,40,000 కోట్లకు చేరుకుందన్నారు. ఇది కాదన్నట్లు తాజాగా మరో రూ. 1000 కోట్లు అప్పుగా తీసుకు వచ్చిందని చెప్పారు. బుధవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 26 ఏళ్ల కాల పరిమితితో 7.3% వార్షిక వడ్డీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ అప్పులు ఎవరి కోసం, ఎందు కోసం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. ఇప్పటికే రుణ భారంతో రాష్ట్రం కుదేలైందన్నారు. ఇంకా ఎన్ని అప్పులు తీసుకు వచ్చి ప్రజల నడ్డి విరుస్తారంటూ ప్రశ్నించారు హరీశ్ రావు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటిసారి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటిది ఎన్నడూ చోటు చోసుకోలేదన్నారు. దీని బట్టి చూస్తే పాలనా పరంగా ఫెయిల్యూర్ అయ్యిందనేది తేలి పోయిందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి దీనికి పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.






