DEVOTIONAL

17 నుండి ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు

Share it with your family & friends

జూన్ 21 వ‌ర‌కు కొన‌సాగుతాయని టీటీడీ వెల్ల‌డి

తిరుప‌తి – తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మ వారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచ రాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మ వారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవ జలధిలో మునిగి పోకుండా రక్షించి, సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.

జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజ స్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మ వారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మ వారికి స్నపన తిరుమంజనం నిర్వహించ‌నున్నారు.

అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతి రోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మ వారి ఊరేగింపు నిర్వహిస్తారు.