DEVOTIONAL

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

అప్ప‌లాయ‌గుంట వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో

తిరుప‌తి : త‌ఇరుప‌తిలోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వ దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ప్రధాన అర్చకులు సూర్య‌కుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ‌, అర్చక బృందం పాల్గొన్నారు.